| About us | Contact us | Advertise with us

Monday, November 18, 2013

కరెంట్‌ అఫైర్స్‌ - సచిన్‌ తెందూల్కర్‌

కరెంట్‌ అఫైర్స్‌ - సచిన్‌ తెందూల్కర్‌ జాతి గర్వించదగ్గ వ్యక్తి సచిన్‌ తెందూల్కర్‌. ఒక వ్యక్తి ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 24 సంవత్సరాలపాటు క్... thumbnail 1 summary
కరెంట్‌ అఫైర్స్‌ - సచిన్‌ తెందూల్కర్‌
జాతి గర్వించదగ్గ వ్యక్తి సచిన్‌ తెందూల్కర్‌. ఒక వ్యక్తి ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 24 సంవత్సరాలపాటు క్రికెట్‌ సామ్రాజ్యంలో తిరుగులేని మహారాజులా తన స్థానాన్ని నిలబెట్టుకున్న సచిన్‌ తెందూల్కర్‌ గురించిన కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో జరుగబోయే కాంపిటేటివ్‌ పరీక్షలలో సచిన్‌తెందూల్కర్‌ కెరీర్‌పై కరెంట్‌ అఫైర్స్‌ విభాగంలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది

పూర్తి పేరు : సచిన్ రమేష్ టెండూల్కర్
పుట్టిన తేదీ : ఏప్రిల్ 24, 1973
పుట్టిన ప్రదేశం : ముంబై, మహారాష్ట్ర
తల్లిదండ్రులు : రమేష్ టెండూల్కర్, రజని
భార్య, పిల్లలు : అంజలి, సారా, అర్జున్
ఎత్తు : 5 అడుగుల 5 అంగుళాలు(165.1 సెంటీమీటర్లు)
కుడిచేతివాటం బ్యాట్స్‌మన్, కుడిచేతివాటం బౌలర్
టెస్టులు
199 మ్యాచ్‌లు, 15,847 పరుగులు, 248 నాటవుట్, సగటు 53.71, సెంచరీలు 51, హాఫ్ సెంచరీలు 67.
వన్‌డేలు
463 మ్యాచ్‌లు, 18,426 పరుగులు, 200 నాట్ అవుట్, సగటు 44.83, సెంచరీలు 49, హాఫ్ సెంచరీలు 96.
ముఖ్యమైన తేదీలు
ఏప్రిల్ 24, 1973 : ముంబయిలో జననం
డిసెంబర్ 11, 1988 : పదిహేనేళ్లకే ఆటలో ప్రవేశం.
నవంబర్ 15, 1989 : కరాచీలో పాకిస్తాన్‌తో టెస్ట్‌మ్యాచ్
డిసెంబర్ 18, 1989 : గుజ్రన్‌వాలాలో పాకిస్తాన్‌తో వన్ డే
ఆగస్టు 14, 1990 : 17 సంవత్సరాల ప్రాయంలో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి టెస్ట్ సెంచరీ.
డిసెంబర్ 10, 2005 : గవాస్కర్ 34 టెస్టు సెంచరీల ప్రపంచ రికార్డును అధిగమించాడు.
అక్టోబర్ 17, 2008 : టెస్టుల్లో ఎక్కువ పరుగులు చేసి బ్రియాన్ లారాను అధిగమించాడు.
ఫిబ్రవరి 24, 2010 : వన్-డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మన్.
ఏప్రిల్ 2, 2011 : వరల్డ్ కప్ సాధించిన జట్టులో సభ్యుడు.
మార్చి 16, 2012 : అంతర్జాతీయ మ్యాచ్‌లలో 100 సెంచరీలు సాధించిన ఒకే ఒక బ్యాట్స్‌మన్.
అక్టోబర్ 10, 2013 : 200వ మ్యాచ్ ఆడిన తరువాత ఆటనుంచి విరమించనున్నట్లు ప్రకటన. ఇంతకు ముందే వన్-డే నుంచి, ట్వంటీ 20 నుంచి విరమించుకున్నాడు.
ఇంగ్లండ్‌పై 119 నాటౌట్ (1990)
సచిన్ 17 ఏళ్ల ప్రాయంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన తొలిటెస్ట్ మ్యాచ్‌లోనే మాస్టర్ శతకం సాధించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 408 పరుగుల లక్ష్య ఛేదనలో 127 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో ఆరోస్థానంలో బరిలోకి దిగిన యువ సచిన్ ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు. సచిన్ అజేయ సెంచరీతో కడదాకా క్రీజులో నిలవడంతో.. భారత్ ఓటమి తప్పించుకుని మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది.
ఆస్ట్రేలియాపై 114 (1992)
ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ వేదికపై మరో అద్భుత ఇన్నింగ్స్‌తో సచిన్ అలరించాడు. బౌన్సీ పిచ్‌పై ఆసీస్ పేస్ బౌలర్లు క్రెగ్ మెక్ డెర్మాట్, మెర్వ్ హ్యూస్‌లను ఎదుర్కొని సచిన్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (114) చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో భారత్ పరాజయం చవి చూసింది. మ్యాచ్ ఓడినా యువ సచిన్ కంగారూల మదిని గెలిచాడు.
దక్షిణాఫ్రికాపై 111 (1992)
యువ సచిన్‌కు ఈ పర్యటన కూడా అగ్ని పరీక్షగా నిలిచింది. వాండరర్స్ వేదికపై మాస్టర్ బ్యాట్ నుంచి అద్భుత సెంచరీ జాలు వారింది. రవిశాస్త్రి, మంజ్రేకర్, అజరుద్దీన్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరినా.. సచిన్ ఎక్కడా తొణకలేదు. అలెన్ డొనాల్డ్, మెక్‌మిలన్ నిప్పులు చెరుగుతున్నా ఎలాంటి భయం లేకుండా క్రీజులో నిలిచాడు. మాస్టర్ ప్రదర్శనతో భారత్ డ్రాతో గట్టెక్కింది.
దక్షిణాఫ్రికాపై 169 (1997)
దక్షిణాఫ్రికా పర్యటనలో మాస్టర్ మరో అత్యుత్తమ సెంచరీ చేశాడు. కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 529/7 (డిక్లేర్డ్) స్కోరు చేసింది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అజరుద్దీన్‌తో సచిన్ ఆరో వికెట్‌కు 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సచిన్ (169) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
ఆస్ట్రేలియాపై 241 (2004)
ఈ పర్యటనలో తనకిష్టమైన సిడ్నీ గ్రౌండ్‌లో సచిన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు. సచిన్ (241) మూడు రోజులు క్రీజులో నిలిచి ఈ ఫీట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో లక్ష్మణ్ (178), సచిన్ జోడీ నాలుగో వికెట్‌కు 353 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ సచిన్ (60 నాటౌట్) అజేయ అర్ధ సెంచరీతో క్రీజులో నిలిచాడు

మీ చైతన్య కుమార్ సత్యవాడ meenavachaitanyam@gmail.com, 9441687174

No comments

Post a Comment